శిరిడి సాయిని ప్రత్యక్షంగా  సేవించిన  27 మంది భక్తులు

శ్రీ రమణానంద మహర్షి వారు శిరిడిసాయిని ప్రత్యక్షంగా సేవించి సాయి అనుగ్రహాన్ని, లీలలను చవిచూసిన 27 మంది అంకిత శిష్యుల జీవితాలను పరిశోధన చేసి వారి కుమారులను, మునిమనుమలను స్వయంగా ఇంటర్వ్యూచేశారు. మహర్షి వారి ఈ పరిశోధన ఫలితముగా శిరిడిసాయి బాబా ఆయా భక్తుల జీవితాలలో చేసిన అనేక లీలలు, మహిమలు సాయి బోధించిన నిగూఢ సాధనా రహస్యాలు, ఎన్నో జ్ఞానరత్నాలు ఈ సాయిభక్తుల జీవితాలలో లభిస్తాయి.

మహర్షి వారి ఈ పరిశోధనల వలన సాయిబాబా జీవించి ఉన్నప్పుడు ఏ విధముగా శిష్యులను రక్షించారో, కాపాడారో అదే విధముగా బాబా వారు మహాసమాధి చెందిన 100 సంవత్సరాల తర్వాత కుడా వారిని ప్రత్యక్షంగా సేవించిన శిష్యులనే కాకుండా వారి తరతరాల వారిని కూడా అనుక్షణం కంటికి రెప్పలాగా కాపాడుతున్నారు అని తెలుస్తుంది. దీనిని బట్టి బాబావారు ఇప్పటికి అదృశ్యంగా ఉండి శిష్యులను నడిపిస్తున్నారు అనే విషయం బోధపడుతుంది.

2006 వ సంవత్సరములో సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి వారు 27 మంది శిరిడిసాయిని ప్రత్యక్షంగా సేవించిన భక్తుల కుటుంబాల వారిని ఆహ్వానించి, పరమగురువైన శిరిడిసాయిని నిస్వార్ధముగా, ప్రేమతో సేవించినందుకు చిహ్నముగా ఒకే వేదిక మీద (హైదరాబాద్ లో) వారిని సన్మానించారు.

పరమగురువుతో సహజీవనం

శ్రీ రమణానంద మహర్షి వారు శిరిడి సాయిని ప్రత్యక్షంగా సేవించిన 27 మంది అంకిత శిష్యుల జీవితాలను పరిశోధన చేసి వారి మునిమనుమలను స్వయంగా ఇంటర్వ్యూ చేసి వారి జీవిత విశేషాలను సమగ్రంగా రచించిన గ్రంథమే ‘పరమగురువుతో సహజీవనం’ (5 volumes). ఈ గ్రంథములో మహర్షి వారు ఆయా భక్తులు ఏ విధముగా శిరిడిసాయిబాబాను దర్శించారో, శరణాగతి చేసి సేవించారో వివరించారు. ఈ గ్రంథమును ఒక్కసారి అధ్యయనం చేస్తే శిరిడిబాబా వారు స్వయంగా శిష్యులకు బోధించిన ఎన్నో ఆధ్యాత్మిక సాధనా రహస్యాలు మనకు అవగతం అవుతాయి. అంతే కాకుండా సాయిబాబాతో ఏయే శిష్యులు ఎటువంటి ప్రేమ బంధాన్ని, జన్మజన్మల అనుబంధాన్ని కలిగివున్నారో అనే విషయాలు కూడా చక్కగా అవగతము అవుతాయి. ఈ గ్రంథాలు తెలుగు భాషలో అందుబాటులో ఉన్నాయి.