పరమానందం అంటే ఏమిటి?

దుర్లభమైన నిర్వికల్ప సమాధిని ఆత్మదర్శనం లేదా స్వస్వరూప దర్శనం అంటారు. పరబ్రహ్మ సాక్షాత్కారం లేదా ఆత్మసాక్షాత్కారం పొందడమే నిజమైన పరమానందం.

సర్వ వేద  సారం సమస్త తత్వ శాస్త్రాల సారాంశం, “నేనే భగవంతుడను” అనే అనుభూతిని పొందడం. నామ, రూప, గుణ రహిత సచ్చిదానంద పరబ్రహ్మమే ప్రతీజీవి సత్య స్వరూపం. దేనిని దర్శిస్తే నేను అనే వ్యక్తిత్వాన్ని కోల్పోయి నిశ్చల, నిర్వికార, నిర్గుణ, అఖండ, ఆనంద స్వరూపం అవుతాడో, దేనిని దర్శిస్తే మనస్సు, ప్రపంచం లేనేలేవు ఉన్నది ఆనందం మాత్రమే అని గ్రహిస్తారో, దేనిని ధృడంగా పొందితే సాధారణ మానవుడు, సర్వజ్ఞుడు, సర్వ సమర్ధుడు, సాక్షాత్తు పరబ్రహ్మ అవుతాడో ఆ అనుభూతినే  ఆత్మసాక్షాత్కారం లేదా పరబ్రహ్మ సాక్షాత్కారం అంటారు. పరబ్రహ్మం కాలంలో నశించేది కాదు. ప్రకృతి అనేక గుణములు కలిగియున్నది. పరబ్రహ్మము ఎట్టి గుణములు లేనట్టిది. ఆత్మదర్శనం అంటే మాటలతో నిర్వచించలేని దివ్యానుభూతి.

పరమానందాన్ని అనుభవించు - సిద్ధగురు ప్రజ్ఞానం

నేనే దేవుడను లేదా పరబ్రహ్మమును అనే మాటలకందని బుద్ధికి అతీతమైన దివ్య అనుభూతిని పొందడమే పరమానందం. ఈ స్థితినే ఆత్మదర్శనం అని నిర్వికల్ప సమాధి అని అంటారు. ఎవరైతే తనలోని బ్రహ్మాన్ని దర్శించి, బ్రహ్మమై మిగిలిపోతాడో, అతడు కొన్ని సెకన్లలోనే పరమానందం పొందుతాడు. పరబ్రహ్మం సహజంగానే ఎన్నో శక్తులు, పవిత్ర లక్షణాలు కలిగి ఉంటుంది. ఆ కారణం చేతనే బ్రహ్మానుభూతి పొందిన వ్యక్తి కూడా ఎన్నో శక్తులు, పవిత్ర లక్షణాలు పొందుతాడు. ఈ విశ్వంలో జీవుడు అనుభవించే విషయానందం (శబ్ద,స్పర్శ,రూప,రస,గంధ) పరమానందములో కేవలం 5% మాత్రమే. ఎవరైనా 100% పూర్ణ ఆనందం పొందాలంటే అది నిర్వికల్ప సమాధిలోనే పొందగలము.

సాధకుడు మనస్సును నిశ్చలము చేసి పరమానందము అనుభవించడానికి రెండు మార్గాలు ఉన్నాయి . ఒకటి లివింగ్ సిద్ధగురు అనుగ్రహాన్ని పొందడం ,రెండు తీవ్రంగా ధ్యానం చేసి మనస్సును నిశ్చలము చేయడము. సాధకుడు సొంత ప్రయత్నముతో సాధించేది  స్వల్పము. దానికన్నా గురు అనుగ్రహముతో సాధించేది శతకోటి రేట్లు మహిమాన్వితము. ఎందుకంటే సాధకుడు దుర్లభమైన నిర్వికల్ప సమాధి అనుభూతి పొందాలంటే అతని మనస్సు, గుణములు పవిత్రంగా ఉండాలి లేనిచో తీవ్ర ధ్యానం చేయలేడు. కానీ పవిత్రమైన మనస్సు, గుణములు లేకున్నా ఒక లివింగ్ సిద్ధగురు అనుగ్రహముతో శక్తిపాతం చేసినప్పుడు , కుండలినీశక్తి జాగృతమై క్షణాలలో నిర్వికల్ప సమాధి పొంది పరమానందం పొందగలడు . అందుకే ఆత్మసాక్షాత్కారం పొందిన లివింగ్ సిద్ధగురువును మనసా,వాచా,కర్మణా దివ్య ప్రేమతో సేవించాలి.

ఆత్మసాక్షాత్కారం పొంది తన దివ్యశక్తితో ఇతరులకు  ఆత్మసాక్షాత్కారం ప్రసాదించే సిద్ధత్వం గల గురువును సిద్ధగురువు అంటారు. ఆత్మసాక్షాత్కార అనుభూతి లేకుండా ఉపన్యాసాలు చెప్పే వారిని,సమాధి అనుభూతి లేకుండా ధ్యాన శిక్షణ ఇచ్చేవారిని ,సాధారణ గురువులు అంటారు. కానీ ఈనాడు లోకంలో ఈ జ్ఞానం లేకపోవడం వలన సాధారణ గురువులనే  సిద్ధగురువులనుకుని సేవిస్తున్నారు. కాబట్టి శిష్యులు సేవించవలసింది సిద్ధగురువునే కానీ సాధారణ గురువును కాదు.

నిర్వికల్ప సమాధిని అనుభూతిగా పొందని సాధారణ గురువు శిష్యులకు ఏ విధంగా సమాధిని కలిగించగలడు? కలిగించలేడు. అంతేగాకుండా శిష్యుల కష్టాలు, బాధలను తీర్చే శక్తి సాధారణ గురువుకు ఉండదు. కానీ సాధకులకు ఈ విషయం తెలియక అజ్ఞానముతో సాధారణ గురువులను సేవిస్తారు. కాబట్టి సర్వప్రయత్నములతో సాధకుడు ఒక సిద్ధగురువును మాత్రమే సేవించి, అతని అనుగ్రహాన్ని సాధించాలి.

ధ్యానముతో మనస్సును నిశ్చలము చేస్తే ,మనస్సు ఆత్మలో లయిస్తుంది. మనో నిశ్చలతనే సమాధి అని అంటారు .  మనస్సు నిశ్చలము కాకుండా పరమానందమును అనుభవించలేరు . పూజలు ,స్తోత్రాలు ,భజనలు ,జపములు అనే కర్మల వల్ల మనస్సు నిశ్చలము కాదు .ఎందుకంటే అవన్నీ బుద్ధి పరిధిలో జరిగేవి . కాబట్టి బుద్ధితో చేసే ఏ కర్మలోనైనా మనస్సు ఉంటుంది . తీవ్ర ధ్యానముతో మనసును దాటినపుడు నిర్వికల్ప సమాధిని అనుభూతిగా పొందగలము . సాధకుడు సొంతముగా ధ్యానం చేయలేనప్పుడు ఒకేఒక మార్గం లివింగ్ సిద్ధగురువును ఆశ్రయించడము!

ఏ విధంగా మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయకపోతే ఫోన్ కాల్స్ ను నిరంతరం రిసీవ్ చేసుకుంటుందో ,అదేవిధంగా మనిషి మనస్సును స్విచ్ ఆఫ్ చేయకపోతే నిరంతరమూ ఆలోచనలను ఇస్తూనే ఉంటుంది. మొబైల్ స్విచ్ ఆఫ్ చేయడం అందరికీ తెలుసు కానీ మనస్సును స్విచ్ ఆఫ్ చేయడం ఎలాగో మనిషి కి తెలియడం లేదు.

సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి వారు నీ మనస్సు ఏ విధంగా స్విచ్ ఆఫ్ చేయాలి అనే రహస్యాన్ని బహిర్గతం చేస్తున్నారు. శ్రద్ధతో శ్రవణము చేయగలరు.

మనస్సు నిశ్చలముగా ఉన్నప్పుడు సహజంగానే మనస్సు స్విచ్ ఆఫ్ అవుతుంది. మనస్సు స్విచ్ ఆఫ్ అయినప్పుడు ఆలోచనలు ఆగి పోతాయి.మనస్సు నిశ్చలము కావడం వలన సమాధి స్థితి కలిగి ఆ పరమానందం అనుభవించగలం.

అసలు మనస్సును నేను ఎందుకు స్విచ్ ఆఫ్ చేయాలి అని నీవు ప్రశ్నించవచ్చు. మనస్సును స్విచ్ ఆఫ్ చేయకపోతే నిరంతరమూ మనస్సు కలిగించే ఆలోచనల నుండి తప్పించుకోలేరు. ఆలోచనల ఫలితముగా పరమానందం, పరమశాంతి మనిషి పొందలేడు. అంతేకాక అనంతదుఃఖ సాగరంలో పడతాడు. కాబట్టి తీవ్ర ధ్యానముతో మనస్సును నిశ్చలము చేయాలి.

మీరు ఒక సిద్ధగురువును ఆశ్రయించి, సేవ మరియు ఆ గురువు చెప్పిన మార్గంలో ధ్యానం నిరంతరమూ చేస్తున్నప్పుడు ప్రాపంచిక జీవితాన్ని త్యజించ వలసిన అవసరం లేదు. భారతీయ సంప్రదాయం మరియు ఇతర సంప్రదాయాలలో పరమానందం పొందాలంటే నీవు నీ వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేయాలన్న నియమం ఉంది. కానీ అసలు సత్యం ఏమిటంటే ఒక సాధకుడు సిద్ధగురు మార్గంలో నిరంతరమూ ధ్యానం చేస్తున్నప్పుడు, అతని ఆధ్యాత్మిక జీవితముపై ప్రాపంచిక జీవితం ఎలాంటి ప్రభావం చూపలేదు.

ఒక గురువును ఎన్నుకునే ముందు, సేవ చేసే ముందు శిష్యుడు రెండు విషయాలు పరిశీలించాలి. 1. నీవు ఎన్నుకునే గురువు పరమాత్మ సాక్షాత్కారం పొందాడా లేదా? 2. శిష్యుడికి పరమాత్మ సాక్షాత్కారం కలిగించగల సిద్ధత్వము ఆ గురువుకు ఉందా లేదా అని పరిశీలించాలి. ఇతరుల అభిప్రాయాలను నీవు గుడ్డిగా నమ్మరాదు. గురువునే అడిగి తెలుసుకోవాలి.

సిద్ధగురు సంప్రదాయంలో ఒక అనివార్యమైన నియమం ఉంది. అది ఏమిటంటే గురువు అనుగ్రహం శిష్యుడి దివ్య ప్రేమపై ఆధారపడి ఉంటుంది. గురు అనుగ్రహం, శిష్యుడి దివ్య ప్రేమకు అనులోమానుపాతంలో ఉంటుంది. “నీ ప్రేమ ఎంతో, నీవు సిద్ధగురువు నుంచి పొందే అనుగ్రహము అంత!” అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే గురు అనుగ్రహం ధనముతో, కీర్తితో, అహంకారంతో పొందేది కాదు. కేవలం శిష్యుడు ప్రేమతో గురువును సేవిస్తే పొందేది.

దివ్య ప్రేమ, అహంకారము; వెలుగు, చీకటి లాంటివి. చీకటి ఉంటే వెలుగు ఉండలేనట్లుగా, అహంకారం ఉంటే దివ్య ప్రేమ ఉండదు. గురు అనుగ్రహముతో పరమానందం నీవు పొందాలంటే నీ అహంకారాన్ని సిద్ధగురు పాదాలలో సమర్పించాలి.

సిద్ధగురువు సహాయం లేకుండా, శిష్యుడు సొంత ప్రయత్నముతో క్రమం తప్పకుండా ధ్యానం చేసి ఆ పరమాత్మ సాక్షాత్కారం పొందలేడా అని ప్రశ్నించవచ్చు.

సత్యం ఏమిటంటే తాళపు చెవి లేకుండా ఏ విధంగా తాళం తీయబడదో, అదే విధంగా గురువు అనుగ్రహం లేకుండా ఎవరూ పరమాత్మను దర్శించలేరు. ఇది ఒక గ్రుడ్డి సిద్ధాంతం కాదు. పరమాత్మ సాక్షాత్కారం పొందిన ఎందరో సిద్ధగురువుల జీవితాలే నిదర్శనం.

అద్వైత సిద్ధాంతం లేదా ఏకత్వ ప్రతిపాదన సత్యము మరియు సనాతనము. అద్వైత సిద్ధాంతం యొక్క ముఖ్య సారాంశం “జీవుడే దేవుడు.” ఈ ప్రతిపాదన ఒక గుడ్డి ప్రతిపాదన కాదు, మన సనాతన మహర్షులు, యోగులు అనుభూతితో గ్రహించి, నిరూపించిన సత్యం.

వేదం ప్రకారం, సిద్ధగురువుల, యోగుల, ఋషుల ప్రకారము ద్వైత జ్ఞానం అసత్యం . ఆత్మ సాక్షాత్కారం పొందని, భ్రమలో ఉండే మనుషుల చేత ద్వైత జ్ఞానం చెప్పబడింది. ఆత్మ సాక్షాత్కారం పొందిన మహితాత్ములు ద్వైత జ్ఞానాన్ని ఎప్పుడూ అంగీకరించరు.

వేదం ప్రకారం, సర్వ సిద్ధగురువుల, ఋషుల, యోగుల ప్రకారం విశిష్ట అద్వైతం సత్యం కాదు. పరమాత్మ సాక్షాత్కారం పొందని కొందరు విద్వాంసులు బుద్ధి పరిధిలో విచారణ చేసి ప్రతిపాదించిన సిద్ధాంతం విశిష్ట అద్వైతం. దీనిని పరమాత్మ సాక్షాత్కారం పొందిన వారు పొరపాటున కూడా అంగీకరించరు.

ఎవరైతే ఆత్మ సాక్షాత్కారము పొంది వేదములను అధ్యయనము చేశారో వారు “జీవుడే దేవుడు” అనే సత్యాన్ని నిస్సంకోచంగా చెప్తారు. ఎవరైతే ఆత్మ సాక్షాత్కారము పొందకుండా వేదమును అధ్యయనం చేస్తారో వారు జీవుడు వేరు, దేవుడు వేరు అని ప్రచారం చేస్తారు. ఇటువంటి వారు జీవుడు ఏ విధంగా దేవుడు అవుతాడు? దేవుడు విశ్వాన్ని సృజించాడు కానీ జీవుడు సృజించలేడు కదా అని వాదిస్తారు. నిజమే! దేవుడే ఈ విశ్వాన్ని సృజించాడు. కానీ నిగూఢ రహస్యం ఏమంటే జీవుడు పరమాత్మను దర్శించి సిద్ధత్వము సాధిస్తే ఆ దేవుని వలె సర్వ శక్తివంతుడు అవుతాడు. విశ్వామిత్ర మహర్షియే దీనికి నిదర్శనం.

మాయ అంటే భ్రాంతి లేదా భ్రమ. మాయ ఉన్నదానిని లేనట్లుగా, లేనిదానిని ఉన్నట్లుగా చూపిస్తుంది. మాయ భగవంతుని యొక్క మరో స్వరూపం. మాయ కూడా దేవుడితో సమానమైన ఒక బలవత్తర శక్తి.